ఇజ్రాయెల్‌తో దోస్తీ కుదరదు.. ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పాకిస్థాన్‌

  • అబ్రహం ఒప్పందంలో చేరాలని ట్రంప్ పిలుపు
  • అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన పాకిస్థాన్‌
  • ఇజ్రాయెల్‌తో చర్చలు అసాధ్యమన్న పాక్ రక్షణ మంత్రి
  • పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా
  • ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో ట్రంప్ కొత్త మెలిక
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన ‘అబ్రహం ఒప్పందం’ ప్రతిపాదనను పాకిస్థాన్‌ తిరస్కరించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించుకోవాలంటూ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని తాము ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇరాన్‌తో కుదుర్చుకోబోయే శాంతి ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్‌తో పాటు పాకిస్థాన్ కూడా అబ్రహం ఒప్పందంపై సంతకం చేయడం తప్పనిసరి అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొనడంతో ఈ వివాదం మొదలైంది.

మా సిద్ధాంతాలకు వ్యతిరేకం
ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఘాటుగా స్పందించారు. ‘‘మా దేశ ప్రాథమిక సిద్ధాంతాలు, ఆదర్శాలకు విరుద్ధంగా ఉండే ఎలాంటి ఒప్పందాల్లోనూ పాక్‌ భాగస్వామి కాబోదు. ఒక్క రోజు కూడా మాట మీద నిలబడని, నమ్మకద్రోహానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఇజ్రాయెల్‌తో మేం కలిసి కూర్చోవడం అసాధ్యం’’ అని ఆయన తేల్చి చెప్పారు. తమ దేశ అధికారిక విధానం ప్రకారం ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించే ప్రసక్తే లేదని తెలిపారు.

లంకె లేదు
ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌లో.. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని, ఈ చారిత్రాత్మక ఒప్పందంలో భాగం కావాలంటే ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు పెట్టుకోవాల్సిందేనని షరతు పెట్టారు. దీనిపై పాకిస్థాన్‌ ప్రభుత్వ వర్గాలు మండిపడుతున్నాయి. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు, అబ్రహం ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదని, ఎవరో ఒత్తిడి తెచ్చారని లొంగిపోయే పరిస్థితిలో పాక్‌ లేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

సౌదీ అరేబియా కూడా
సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన, శాశ్వతమైన మార్గం సుగమం అయ్యే వరకు ఇజ్రాయెల్‌తో చేతులు కలిపేది లేదని సౌదీ పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల పట్ల ముస్లిం దేశాల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఈ అబ్రహం ఒప్పందాన్ని విస్తరించాలనే ట్రంప్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఏంటి ఈ అబ్రహం ఒప్పందం?
ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వాన్ని ముగించి.. దౌత్య, ఆర్థిక, రక్షణ సంబంధాలను మెరుగుపరిచేందుకు 2020లో ట్రంప్ ఆధ్వర్యంలో ఈ ‘అబ్రహం అకార్డ్స్’ ప్రారంభమయ్యాయి. మొదట యూఏఈ, బహ్రెయిన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేయగా.. ఆ తర్వాత మొరాకో, సూడాన్, కజకిస్థాన్‌ ఇందులో చేరాయి. పాలస్తీనా సమస్యను పక్కనబెట్టి కేవలం వ్యాపార, ప్రాంతీయ రక్షణే ధ్యేయంగా ఈ కూటమి పనిచేస్తోంది.

Pakistan
Abraham Accords
Donald Trump
Israel
Saudi Arabia
Iran
Palestine
UAE
Khawaja Muhammad Asif

More Telugu News